Skip to content
ఒకప్పుడు కొత్త బండి లేదా కారు కొనాలంటే చాలా సంతోషంగా అనిపించేది. కానీ, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పడే తిప్పలు తలచుకుంటేనే భయం వేసేది. ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ రోజులు తరబడి తిరగడం, పనులన్నీ వదిలిపెట్టి అక్కడే గంటల తరబడి ఎదురుచూడటం, చివరికి ఏజెంట్ కో భారీగా డబ్బులు ఇస్తే గానీ పని పూర్తి కాకపోవడం… ఇవన్నీ చాలామందికి ఎదురైన చేదు అనుభవాలే. కానీ, ఇప్పుడు ఈ కష్టాలన్నీ తీరిపోయాయి. ఇకపై మీరు కొత్త వెహికిల్ కొనుగోలు చేసిన చోటే, అంటే షోరూమ్‌లోనే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. ఇది ఎలా సాధ్యం అంటే, తెలంగాణ రవాణా శాఖ చేపట్టిన ఒక సరికొత్త విధానం వల్ల. ఈ వీడియో దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వివరంగా తెలుసుకుందాం.
చాలా కాలంగా RTA ఆఫీసుల్లో ఏజెంట్ల పెత్తనం బాగా పెరిగిపోయింది. కొత్త వెహికిల్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి డ్రైవింగ్ లైసెన్స్ వరకు, ప్రతీ పనికి కమిషన్లు ఇవ్వనిదే ముందుకు కదిలేది కాదు. దీనివల్ల ప్రజలకు టైమ్ వేస్ట్ అవ్వడమే కాకుండా, అనవసరంగా డబ్బులు కూడా వృథా అయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
కొత్త వెహికిల్స్‌ను నేరుగా షోరూమ్‌ల నుంచే రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను ఆయా షోరూమ్‌ల యజమానులకు అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల రవాణా శాఖపై పనిభారం తగ్గడమే కాకుండా, ప్రజల కష్టాలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి, ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2016లోనే ప్రవేశపెట్టింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తో సహా చాలా రాష్ట్రాలు ఈ పద్ధతిని అమలు చేశాయి. కానీ, తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి, దీనిపై దృష్టి పెట్టింది.
ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి రవాణా శాఖ ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ను డెవలప్ చేస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ సహాయంతో వెహికిల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం షోరూమ్‌లోనే పూర్తవుతుంది. మొదట, దీన్ని హైదరాబాద్‌లోని కొన్ని షోరూమ్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. ఆ తర్వాత, వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలోనూ దీన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కొత్త పద్ధతి వల్ల మీరు వెహికిల్ కొనుగోలు చేసిన వెంటనే, అక్కడే రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయవచ్చు. ఆ తర్వాత, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మీ వెహికిల్ పర్మనెంట్ ఆర్‌సీ స్మార్ట్ కార్డ్ నేరుగా మీ ఇంటికే పోస్ట్ ద్వారా వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 2,000 కు పైగా టూ వీలర్లు, 500కు పైగా ఫోర్ వీలర్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఈ కొత్త విధానం అమలయితే, ఆ వెహికిల్ యజమానులందరికీ RTA ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పిపోతుంది.
ఈ కొత్త విధానం ఎంత మంచిదైనా, దీనిపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ బాధ్యతను పూర్తిగా షోరూమ్‌లకు అప్పగిస్తే, ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా, కొందరు షోరూమ్ నిర్వాహకులు, వెహికిల్ ఓనర్లు కలిసి నకిలీ అడ్రస్‌లతో, తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇప్పుడు కూడా కొన్ని RTA కార్యాలయాలలో ఏజెంట్లు సరిగ్గా లేని పత్రాలతో కూడా లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తికి ఇదివరకే ఒక వెహికిల్ ఉండి, రెండో వెహికిల్ కొంటే రిజిస్ట్రేషన్ సమయంలో 2% అదనపు పన్ను చెల్లించాలి. షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తే, ఈ అదనపు పన్నును ఎగ్గొట్టే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ కొత్త విధానం పూర్తిగా అమలయ్యాక ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.