ఈ రోజుల్లో అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వాటితో మనం చాలా పనులు సులభంగా చేసుకుంటున్నాం. కానీ, ఈ డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త పద్ధతులతో మనల్ని మోసం చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ కొత్త పద్ధతి ‘స్క్రీన్ షేరింగ్’. దీని ద్వారా నేరగాళ్లు మన మొబల్‌లోని సమాచారాన్ని మొత్తంగా చూసేస్తారు.
స్క్రీన్ షేరింగ్ అంటే మన ఫోన్ స్క్రీన్ మీద కనిపించే కంటెంట్ అంతా వేరొకరి ఫోన్ లేదా కంప్యూటర్‌లో కనిపించడం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు, టెక్నికల్ సపోర్ట్ కోసం టీమ్ వ్యూవర్, అనీ డెస్క్ లాంటి యాప్‌లను వాడడం చూస్తుంటాం. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. దీని ద్వారా మీ ఫోన్‌లో మీరు ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో అన్నీ వారికి తెలిసిపోతాయి. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ పే, క్రెడిట్ కార్డు పాస్‌వర్డ్‌లు, ఫోటోలు, వీడియోలు అన్నీ క్షణాల్లో వారి చేతికి వెళ్లిపోతాయి. చివరికి మీ అకౌంట్ ఖాళీ అవడం ఖాయం.
సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని మోసం చేయడానికి కొన్ని పద్ధతులను అనుసరిస్తారు. వాటిలో ప్రధానమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంక్ అధికారులుగా ఫోన్ చేసి, మీ అకౌంట్‌లో సమస్య వచ్చిందని లేదా KYC అప్‌డేట్ చేయాలని చెప్తారు. వెంటనే చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని కంగారు పెడతారు. తర్వాత, ‘మాకు వీడియో కాల్ చేసి స్క్రీన్ షేర్ చేయండి, మేమే అన్నీ చేసేస్తాం’ అని నమ్మిస్తారు. మీరు వారి మాటలు నమ్మి ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తే, మీ ఫోన్ కంట్రోల్ మొత్తం వారికి వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తే, మీ పాస్‌వర్డ్ చూసి మొత్తం డబ్బును ఖాళీ చేసేస్తారు.
మీకు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయలేదని, లేదంటే ఏదైనా కొత్త ఆఫర్ వచ్చిందని మెసేజ్ లేదా వాట్సాప్‌లో లింక్ పంపిస్తారు. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే, అది మిమ్మల్ని ఒక ఫేక్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. అది నిజంగా ఒక టెక్నికల్ సపోర్ట్ యాప్ అనుకొని మీరు ఇన్స్టాల్ చేసి స్క్రీన్ షేర్ చేస్తే, మీ ఫోన్ యాక్టివిటీ మొత్తం వారి కంట్రోల్‌లోకి వెళ్తుంది.
మీరు స్క్రీన్ షేర్ చేసిన తర్వాత, నేరగాళ్లు మీ వాట్సాప్‌ను వాళ్ళ ఫోన్‌లో యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. దానికోసం వారికి వచ్చే OTP మన స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి అది వారికి కూడా తెలిసిపోతుంది. ఆ OTP వాడి మీ వాట్సాప్ అకౌంట్‌ను హైజాక్ చేస్తారు. ఇదే విధంగా యూపీఐ ఐడీలను కూడా హైజాక్ చేసి మీ అకౌంట్లలో డబ్బు మొత్తం దోచుకుంటారు.
ఈ మోసాల నుండి జాగ్రత్తగా ఉండటానికి కొన్ని సూచనలు పాటించాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా ఫోన్ చేసి స్క్రీన్ షేర్ చేయమని అడిగితే చేయవద్దు. ముఖ్యంగా, మీకు తెలియని వాళ్లు, బ్యాంక్ అధికారులు అని చెప్పేవారిని నమ్మకండి. బ్యాంకులు ఎప్పుడూ ఇలాంటి రిక్వెస్ట్‌లు చేయవు.
మీకు తెలిసిన, నమ్మకమైన సోర్స్ నుంచి వచ్చిన లింకులను మాత్రమే క్లిక్ చేయండి. అనుమానాస్పద లింకులను అస్సలు ఓపెన్ చేయొద్దు.
మీ ఫోన్లో స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉందా లేదా అనేది తరచూ చెక్ చేసుకోండి. అవసరం లేనప్పుడు దాన్ని డిసేబుల్ చేయండి. అలాగే, వాట్సాప్ మరియు ఇతర ముఖ్యమైన అకౌంట్‌ల నుంచి తరచూ సైన్ అవుట్ చేయడం మంచి అలవాటు.
ఈ తరహా మోసాల గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏది నిజమైన కాల్, ఏది ఫేక్ కాల్ అని గుర్తించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ మోసాలకు ప్రధాన కారణం ప్రజలకు వీటిపై అవగాహన లేకపోవడమే.
ఈ జాగ్రత్తలు పాటిస్తే సైబర్ నేరగాళ్ల బారి నుండి మీ డేటా, మీ డబ్బును రక్షించుకోవచ్చు. గుర్తుంచుకోండి, అపరిచితులకు మీ వ్యక్తిగత వివరాలను, ముఖ్యంగా ఫోన్ స్క్రీన్‌ను షేర్ చేయడం చాలా ప్రమాదకరం.